Thursday, June 7, 2012

ఇది ఆ బ్రహ్మ వరమా....


కైరవ నిర్మిత తటాకాంచనాన ....
మందార మకరంద మిళింద మరంద సుగంధ వనాన ...
శత సహస్ర  కుసుమాలంకృత  మండపాన...
చందన కుంకుమాది శోభిత ఫాలముతో ..
విచలిత కుంతలముల తోడ ....
సలలిత లావణ్య సుధా మయూఖ రేఖ వోలె ...
చలువరాతి నేలపై చంద్రకాంత శిలను బూనిన
నీ మేని మెరుపును మరపించ
ఆ వెన్నెల సైతం మిన్ను తాకి వెల వెల బోయనే...
ఈ తనూలతను  తాకిన మరుక్షణం...... 
మరణమైనా చేరగ ప్రియమే ...
వికసిత శతదళ  శోభితములైన  నీ కన్నులు..
నా లోని వలరాజును కవ్వించగ సాగెనే
నీ చూపుల విరి తూపుల పవళించ కనుసైగన అనుమతించి,
నీవే సుమ పానుపువై ఆహ్వానించ,
వెలుగు రేఖల వేగాన నీపై వాలగ రానా... 
క్షణమోపక ......... 
ఇక నిన్ను నా గుండియలకు హత్తుకొనగ..
నా ఆణువణువూ రసఝరులతో ఉప్పొంగి ..
హిమాగ్ర శిఖరముల నడుమ ఊయలలూగుతున్న హాయి...
మృదు మధురమైన సుమ మాలికలు నా గుండెలపై అలరారుతున్న ఈ రేయి ...
వర్ణింప నా తరమా...
ఇది ఆ బ్రహ్మ వరమా....